సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

22, జూన్ 2026, సోమవారం

డిటెక్టివ్ భగవాన్ .. నా అభిమాన పాత్ర !

బాల్యంలో  ‘చందమామ’..  తర్వాత  డిటెక్టివ్ నవలలు..  అలా ప్రయాణించి సీరియస్  సాహిత్య రచనలవైపు మళ్లటం. 

 చాలామందికి లాగే పాఠకుడిగా నా పరిణామం కూడా  ఇదే!

 టీవీ పూర్వయుగంలో..   రేడియో  ఆడియో  కాలంలో  పఠనమే కదా  ప్రధాన కాలక్షేపం?  తెలుగునాట  ఆ పఠనాభిలాషను అమాంతం జనంలో  పెంచేశాయి..  డిటెక్టివ్ నవలలు.

 పాకెట్ సైజులో..  పంచరంగుల్లో మెరిసే  ముఖచిత్రంతో.. కాగితాల అంచులకు ఎర్రని పూతతో- చూసీ చూడగానే ఆకర్షించే డిటెక్టివ్ నవలలు పాఠకుల  డోపమీన్ ప్లెజర్ ను సంతృప్తిపరిచేందుకు  పేజీలను పరిచేవి.

 

బుల్లెట్ వేగంతో..

పాత్రల  మానసిక సంఘర్షణా, అంతరంగ ఆలోచనల చిత్రణా ..వీటి గోలలేమీ లేకుండా- మొదటి పేజీ నుంచీ  ‘బుల్లెట్ వేగం’తో దూసుకువెళ్ళే  సంఘటనలూ,  ఊపిరాడనివ్వని ఉత్కంఠా,  విభ్రాంతిలో ముంచెత్తే  సాహసాలూ,  క్రూర హత్యలూ, ఒక్కో ‘ క్లూ’ విప్పుతూ సాగే  తెలివైన  పరిశోధనా,  సరళమైన భాషా...  ఇవీ  డిటెక్టివ్ నవలా లక్షణాలు.  ‘దవడ కండరం బిగుసుకుంది’ ,  ‘రివాల్వర్ నిప్పులు కక్కింది’ లాంటి వర్ణనలతో ఆసక్తిని పెంచేసే  కథనం!

 వయసు పెరిగినా చందమామ పత్రిక మీద ప్రేమ ఎప్పటిలాగే  ఉంటుంది  కదా?  అలాగే ఒకానొకప్పటి కాలంలో సమ్మోహన శైలితో, కథన చాతుర్యంతో  ఊహా ప్రపంచాన్ని విశాలం చేసిన  డిటెక్టివ్స్ అంటే కూడా  ఇష్టం తగ్గదు.

 

శవ సాహిత్యం

అన్ని డిటెక్టివ్ నవలలూ గొప్పవేమీ కాదు. వాటిలోనూ నాణ్యమైనవీ, నాసిరకానివీ ఉండేవి.  ఒక స్థాయిలో రాసేవారి రచనలే అధిక పాఠకుల ఆదరణ పొందేవి.  డిటెక్టివ్ సాహిత్యం హవా ఎంతగా ఉండేదంటే... 1957లో  ఆంధ్రపత్రిక వీక్లీ  ‘డిటెక్టివ్ కథల పోటీ’ని నిర్వహించింది.   (ఇదంతా  పాత సంచికలు చూస్తుంటే తెలిసిన సమాచారం).    

 

పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి తామరతంపరగా పుట్టుకొచ్చిన రచయితలు మితిమీరిన హింసా, ఎంతో కొంత సెక్సూ  మిళితం చేసి ,  అవలక్షణాలు గుప్పించి  పాఠకుల బలహీనతపై గురిపెట్టినందువల్లే  అపరాధ పరిశోధక నవలలపై  వ్యతిరేకతా,  ‘శవ సాహిత్యం’ అనే పేరూ వచ్చాయి.   కొడవటిగంటి కుటుంబరావు  లాంటి రచయితలు  ఈ పత్తేదారు సాహిత్యంపై  వ్యంగ్య రచనలు కురిపించారు.

 ****

 నవలా రచయిత  విశ్వప్రసాద్ రచనలంటే  నాకు చాలా ఇష్టం.   ఏటవాలుగా వంగివున్న అక్షరాలతో చిత్రకారుడు (కేతా)  చక్కగా  చెక్కిన ఆయన పేరు  నవల  ముఖచిత్రంలో  అత్యంత  ఆకర్షణీయంగా నాకు కనిపిస్తుంది. 

 

డిటెక్టివ్ యుగంధర్ ను  సృష్టించిన దిగ్గజ రైటర్  కొమ్మూరి సాంబశివరావు నవలలు కొన్నీ,  షాడో సృష్టికర్త  మధుబాబు నవలలు ఎన్నో చదివినప్పటికీ నా  ఫేవరిట్ రైటర్ మాత్రం విశ్వప్రసాదే.   

 

ఆయన విశిష్టమైన భాషా శైలి నాకెంతో నచ్చుతుంది.  అబ్బురపరిచే  కథా సంవిధానం, డిటెక్టివ్ పాత్రను  ఉన్నతస్థాయిలో, గంభీరంగా చిత్రించే తీరు విస్మయపరుస్తాయి.

 

డిటెక్టివ్ భగవాన్’ ఆయన  నవలల్లో హీరో.  తాను సృష్టించిన పాత్ర పేరుతోనే  ‘భగవాన్ పబ్లికేషన్స్’ పేరుతో 500కు పైగా  పుస్తకాలు ప్రచురించారు.  డిటెక్టివ్ నవలల్లో   సైన్స్ ఫిక్షన్ అంశాలను జోడించడంలో ఈయనది ప్రత్యేక ముద్ర. ఆయన రచనాకాలానికి తెలుగులో అది  ఎంతో ముందడుగు.   

 

డిటెక్టివ్ భగవాన్ ను రచయిత  బహువచనంతోనే  మర్యాద వీడకుండా  చెపుతారు. ఆయనే కాదు, నవలల్లో   ప్రత్యర్థులు కూడా ‘భగవాన్ జీ’ అనో ‘భగవాన్ గారూ’ అనో మర్యాదగా సంబోధించడం ఓ విశేషం.  భగవాన్ భార్య మణి. అసిస్టెంట్ రాంబాబు, అతడి భార్య కిరణ్మయి. బోయ్ భార్గవ.. ఈ పాత్రలన్నీ దాదాపు ప్రతీ నవలలోనూ రిపీటవుతూ వాళ్ల కుటుంబం మనకు సన్నిహితమవుతారు. 

 

విశ్వప్రసాద్  వచనం...

సాంఘిక నవలల్లో కనపడే సరళ సంస్కృతభూయిష్ఠమైన  తెలుగు వాడుకభాషనూ,  ఇంగ్లిష్ సాంకేతిక పదజాలాన్నీ తన డిటెక్టివ్ నవలల్లో సాధికారికంగా ప్రయోగించడం ఆయన ప్రత్యేకత.

 

‘భగవాన్ వెనక్కి తిరిగినట్లు నటిస్తూ మెరుపులా ముందుకురికారు. ఆయన బలమైన చేతులు గొడ్డళ్లలా సెంట్రీ భుజాలమీద పడ్డాయి. సెంట్రీ మొదలు నరికిన చెట్టులా నేలకూలాడు’- ‘భగవాన్ భావగర్భితంగా నవ్వారు’ - ఇలా ఉంటుంది విశ్వప్రసాద్ కథన రీతి.

 

సస్పెన్స్, థ్రిల్లర్ గా ప్రసిద్ధికెక్కిన ‘మాయలాడి’ నవల  విశ్వప్రసాద్ పాపులర్ నవలల్లో ముఖ్యమైనది.  


 జోకర్ , పతిత, స్టీల్ మ్యాన్, బ్లాక్ మ్యాజిక్, డిటెక్టివ్ భగవాన్, ప్రపంచ ప్రేయసి లాంటి నవలలు మరికొన్ని.  

 


ఆయన ‘సుహాసిని’ అనే సాహిత్య మాసపత్రికకూ,  ‘కొత్త గులాబి’  అనే సినీ పక్షపత్రికకూ,  ‘వసంత బాల’ అనే పిల్లల కథల మాసపత్రికకూ సంపాదకునిగా పనిచేశారు.   ‘జగత్ కిలాడీలు’ లాంటి డజన్ సినిమాలకు కథ, మాటలు రాశారు.

 

డిటెక్టివ్ నవలల హవా తగ్గిపోయాక 1989లో  విశ్వప్రసాద్  ‘పంచశూలమ్’ అనే నవలను సీరియల్ గా ఆంధ్రప్రతిక వారపత్రికలో ప్రచురించారు.  (మధుబాబు డిటెక్టివ్  నవలలు కూడా  స్వాతి వీక్లీలో రావడం తెలిసిందే..)


  ‘డిటెక్టివ్ కామిక్స్’ 

డిటెక్టివ్ నవలలతో పాటే  ‘డిటెక్టివ్ కామిక్స్’  అనే ప్రత్యేక విభాగం కూడా  ఉంది. అనూహ్యకోణంలో చిత్రించే అపురూపమైన బొమ్మలతో సాగే అపరాధ పరిశోధనలన్నమాట.  

ఇంగ్లిష్ డిటెక్టివ్ కామిక్స్ కొన్ని తెలుగులోనూ అనువాద రూపంలో వచ్చాయి. ‘ బాలమిత్ర ’ పత్రిక వాటిని ప్రచురించింది. అప్పట్లో తెలుగు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న   ‘ఉక్కుపిడి మాయావి’,  ‘విష వలయం’ , ‘సర్ప దీవి’ ఆ సిరీస్ లోవే.

 ***

కామెంట్‌లు లేవు: