సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

7, సెప్టెంబర్ 2009, సోమవారం

విచిత్ర కవలల స‘చిత్రా’లు!




కప్పుటి 'చందమామ'లో పూర్తి పేజీ సైజు బొమ్మలు నాకెంతో ఇష్టం.

వీటి సంగతి ఆన్‌లైన్ చందమామలో నిన్న వచ్చిన ఆర్టికిల్ లోప్రస్తావించాను. చందమామ చరిత్ర బ్లాగులో ఆన్ లైన్ చందమామ అసోసియేట్ ఎడిటర్ కె. రాజశేఖరరాజు గారి పరిచయ వాక్యాలతో దీన్ని ప్రచురించారు.

సరే, సందర్భం వచ్చింది కదా అని ‘విచిత్ర కవలలు’ సీరియల్ లో నాకెంతో ఇష్టమైన రెండు వర్ణచిత్రాల గురించి ఇప్పుడిలా రాస్తున్నాను.

‘చందమామ’లో పాఠకాదరణ పొందిన తొలి ధారావాహిక ‘విచిత్ర కవలలు’.

రచయిత పేరు తెలీదు. 

(తాజా చేర్పు:  ఈ పోస్టు రాసినపుడు తెలియదు కానీ,  తర్వాత కాలంలో ఈ నవలా  రచయిత  పేరు రాజారావు గారని  తెలిసింది...) .

దీని ప్రచురణ (1950 జులై- 1951 డిసెంబరు) తర్వాతే దాసరి సుబ్రహ్మణ్యం గారి ‘తోక చుక్క’కు అంకురార్పణ జరిగింది.

చందమామలో రెండోసారి ప్రచురించినపుడే (1974 జులై- 1975 డిసెంబరు) ఈ ‘విచిత్ర కవలలు’ ధారావాహికను చదివాను.

మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత, 2009 జనవరిలో చదివితే బాల్యం రోజుల్లో అనుభవించినంత స్థాయిలో  ఉత్కంఠ కలగలేదు. కానీ, నాటి అపురూప  అనుభూతులు స్ఫురణకు వచ్చాయి.

ధారావాహికలో ముగ్గురు కవల సోదరులు కథానాయకులు.

ఉదయనుడూ, 
సంధ్యా, 
నిశీధుడూ.

వీరు తప్పిపోయిన కథానాయికల (సుహాసిని, సుభాషిణి, సుకేశిని) అన్వేషణకు వెళ్తారు. గుర్రాల మీద వెళ్తుండగా ఉదయనుడు కందకంలో పడి, హఠాత్తుగా కనపడకుండా పోతాడు.

మిగిలిన ఇద్దరిలో సంధ్య దప్పిక వేసి, కొలనులో నీళ్ళు కొంచెం తాగగానే శిలాప్రతిమగా మారిపోతాడు.

నిశీధుడు దాహం సంగతి వాయిదా వేసి, ఓ తోటలో మామిడి పండు కొరగ్గానే కోతి రూపం వచ్చేస్తుంది.

ఆ కోతిరూపంతోనే నిశీధుడు, సంధ్య శిలారూపం దాల్చిన కొలను దగ్గరకొచ్చి చుట్టుచుట్టూ తిరగటం మొదలుపెడతాడు.

అప్పుడే కొలనులోంచి ఓ హంస బయటకు వచ్చి, ఉదయనుడిగా మారిపోతాడు.

సంధ్య శిలాప్రతిమ కంటబడి కొయ్యబారిపోతాడు. ఇంతలో కోతి రూపంలో ఉన్న నిశీధుడు ఉదయనుడి దుస్తులను పట్టుకు లాగుతూ కాళ్ళు చుట్టేసుకుంటాడు.

ఇదీ సందర్భం!

దీనికి  'చిత్రా' వేసిన ‘పేజీ సైజు బొమ్మ’  పైన  టైటిల్ కిందనే పెట్టాను,   చూడండి. ఎంత బావుంటుందో!

నీళ్ళు తాగుతూ శిలగా మారిన సంధ్యా కుమారుడూ, 
అతణ్ణి చూస్తూ ఉదయనుడు నిశ్చేష్టుడైవున్న భంగిమా, 
మర్కట రూపంలో నిశీధుడి విచారం... 

ఇవన్నీ ‘చిత్రా’ చాలా అద్భుతంగా వేశారు.

నా చిన్నప్పటి స్మృతిలో ఇప్పటికీ చెదరని చిత్రమిది.

మరో బొమ్మ-

కొలనులో దూకుతూ హంసలుగా మారిపోతున్న నాయికా నాయకులు!

ఇద్దరి చేతులూ హంసల మెడలుగా మారిపోతూండటం, కొలనులోకి దూకుతున్న యాక్షన్ భంగిమా .... వీటిని భలే ఊహించి చిత్రించారు కదూ?

కథలో ఉత్కంఠ కూడా కలిసి, ఈ వర్ణ చిత్రం అప్పట్లో నన్నెంతగా సంభ్రమంలో ముంచెత్తిందో, సమ్మోహితం చేసిందో చెప్పలేను!

( ఈ డిజిటల్ బొమ్మలో క్వాలిటీ లేక అంత స్పష్టంగా కనపడటం లేదు).

ఈ ధారావాహికలో మరెన్నో కనువిందు చేసే వర్ణచిత్రాలున్నాయి.

‘విచిత్ర కవలలు’ను ‘ బ్లాగాగ్ని’ బ్లాగులోకి వెళ్ళి ఎంచక్కా మీ సిస్టమ్ లోకి డౌన్ లోడ్ చేసుకోండి!


ఆకాశంలో చందమామను ఆహ్లాదించని బాల్యం ఎంత నిస్సారమో... 
'చందమామ' పత్రికలో బొమ్మలను చూసి, ఆనందించని బాల్యమూ అంతే అనిపిస్తుంది !

( ‘చిత్రా’ గురించి నేను రాస్తానన్న టపా ఇది కాదు.:) 

 దాని గురించి మరోసారి!)